- టీయూసీపీఏ డిమాండ్
బషీర్బాగ్, వెలుగు: జహీరాబాద్లోని మెథడిస్ట్ చర్చిలో పాస్టర్లు, మహిళలపై ఇటీవల కొందరు దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ (టీయూసీపీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనె సాల్మన్ రాజ్ తెలిపారు. ఆదివారం నారాయణగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చర్చి ఆస్తుల అమ్మకంపై వస్తున్న తప్పుడు వదంతులపై వివరణ ఇచ్చేందుకు వెళ్లిన రెవరెండ్ డాక్టర్ ఎ. స్టీవెన్, ఇతర పాస్టర్లు, మహిళలపై కొందరు దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం కర్రలతో దాడి చేయడం అమానుషమన్నారు. ఈ దాడి దృశ్యాలు సీసీ పుటేజీలో నమోదైనప్పటికీ నిందితులను అరెస్ట్ చేయడంలో జహీరాబాద్ పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఘటన సమయంలో ఎస్సై అక్కడే ఉన్నా దాడిని అడ్డుకోలేకపోయారన్నారు. రాష్ట్ర డీజీపీ, సంగారెడ్డి ఎస్పీ వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నేతలు హేమలత, శాలిని, ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
